శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (09:53 IST)

కరోనా నుంచి కోలుకుంటున్న భారత్.. ఖాళీ అవుతున్న ఐసీయూ వార్డులు

భారతదేశం కరోనా రోగం నుంచి మెల్లగా కోలుకుంటోంది. నిన్నామొన్నటి వరకు కరోనా రోగులతో కిక్కిరిసివున్న ఆస్పత్రుల్లోని ఐసీయూ వార్డులు ఇపుడు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. కరోనా నెగటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
నిజానికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ వ్యాపించింది. అయితే, కేంద్రం తీసుకున్న జాగ్రత్తలతో పాటు.. ముందు చూపు కారణంగా ఈ వ్యాధి తీవ్రత మన దేశంలో తక్కువగా ఉంది. ఏది ఏమైనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో, వివిధ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1.50 లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. 
 
వీటిలో ఇప్పటివరకు కేవలం 1.5 శాతమే వినియోగించారు. కొవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయని, ఆసుపత్రుల్లో రద్దీ కూడా లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేవలం 2 వేల వరకూ ఐసీయూ పడకలను మాత్రమే ఇంతవరకూ వినియోగించామని తెలిపారు. 
 
ఇదిలావుండగా, లాక్ డౌన్ 3.0 సందర్భంలో పలు రకాల మినహాయింపులు ఇవ్వగా, దాని ప్రభావం కేసుల సంఖ్యపై ఏ మేరకు ఉంటుందన్న విషయం మరికొద్ది రోజుల్లో వెల్లడవుతుంది. కేసులు ఎంత వేగంతో పెరుగుతాయన్న విషయమై ఓ అంచనాకు రావాలని కేంద్రం భావిస్తోంది.
 
కాగా, ఈ ఆదివారం ఉదయానికి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 62 వేలను దాటగా, 41 వేలకు‌పైగా యాక్టివ్ కేసులున్నాయి. 19,300 మందికిపైగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 2,101 మంది మరణించారు. 
 
మొత్తం కేసుల సంఖ్యలో 30 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 20 వేలను దాటగా, ఆ తరువాతి స్థానంలో గుజరాత్ 7,800 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో 6,500కు పైగా కేసుల చొప్పున నమోదయ్యాయి.