మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. పుణేలో రాత్రి కర్ఫ్యూ

corona Virus
corona virus
ఠాగూర్| Last Updated: ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (13:25 IST)
దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనాకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పుణెలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు.

ఇక ఫిబ్రవరి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త నిబంధనలను సోమవారం విడుదల చేస్తామని పుణె డివిజనల్ కమిషనర్ చెప్పారు. శనివారం మహారాష్ట్రలో 6,281 కొవిడ్‌ కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

40 మంది మహమ్మారి కారణంగా బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,439 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కిశోరి పడ్నేకర్‌ హెచ్చరించారు.

ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. ఆమె నగరంలో పర్యటించారు. కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రకారం శనివారం ముంబైలో 897 కొత్త కేసులు రికార్డయ్యాయి.దీనిపై మరింత చదవండి :