గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (10:39 IST)

కరోనా అప్‌డేట్: ఇంట్లో ఏసీ వాడుతున్నారా?? అయితే జాగ్రత్త

కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇళ్లలో “కరోనా” వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఎయిర్‌ కండిషనింగ్ (ఏసీ), వెంటిలేషన్‌‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. “ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేంటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్” (ఐఎస్‌హెచ్ఆర్ఏఈ) సూచించిన ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఇళ్లలో ఏసీలు వాడేటప్పుడు 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి అన్నారు.
 
తేమ స్థాయి 40 నుంచి 70 శాతం వరకు ఉంటే మంచిది. తద్వారా రోగకారకాల సమస్యను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఇక కూలర్ల విషయానికొస్తే.. మంచి వెంటిలేషన్ కోసం కూలర్లు బయటి గాలిని పీల్చుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.
 
కూలర్‌ ట్యాంకులు ఎప్పటికప్పుడు క్రిమిసంహారాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలి. తేమగాలి బయటికి పోయేలా కిటికీలు తెరిచి ఉంచాలి. బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లు వాడకపోవడమే మంచిది.
 
ఫ్యాన్లు వినియోగించేవారు కూడా కిటీకీలు కొద్దిగా తెరిచి ఉంచుకోవాలి. దగ్గర్లో ఏదైనా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే.. తగిన వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్‌లో ఉంచడమే మంచిది. “కొవిడ్-19”పై చైనాలోని వంద నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఈ వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తున్నట్టు గుర్తించారు. 
“కొవిడ్-19” ముప్పును పరిమితం చేసేందుకు ఎప్పటికప్పుడు వెంటిలేషన్ చక్కగా ఉండేలా చూసుకోవడం మంచి పరిష్కారమని ఐఎస్‌హెచ్ఆర్ఏ ఈ సూచన చేసింది.