1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (09:06 IST)

ఆసియా కప్ నిర్వహణ పాకిస్థాన్ నుంచే మరో చోటికి... నేడు వేదిక వెల్లడి

Bharat-Pakistan
ఆసియా క్రికెట్ కప్ వేదిక మరో చోటికి తరలి వెళ్లనుంది. పాకిస్థాన్ దేశంలో జరగాల్సిన ఈ పోటీలను మరో చోటికి తరలించాలని సభ్య దేశాలు ప్రతిపాదించాయి. దీంతో ఈ పోటీల నిర్వహణను మరో చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. పలు సభ్య దేశాలు మాత్రం ఈ పోటీలను శ్రీలంకలో నిర్వహించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ పోటీల నిర్వహణ వేదికను మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది.
 
నిజానికి ఈ యేడాది ఆసియా కప్ పోటీలను పాకిస్థాన్ వేదికగా నిర్వహించాల్సి వుంది. అయితే, భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయపరమైన ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో తమ జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. అప్పటి నుంచి ఆసియా కప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
భారత జట్టు పాకిస్థాన్‌లో అడుగుపెట్టకుంటే తాము కూడా భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు రాబోమని పాకిస్థాన్ బెదిరించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దీంతో తటస్థ వేదికపై భారత్ జట్టు తన మ్యాచ్‌లు ఆడే ప్రతిపాదనను పాకిస్థాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా, భారత్ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడితే మిగిలిన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో నిర్వహిస్తామని పీసీబీ ప్రతిపాదించింది.
 
అయితే, దీనికి సభ్య దేశాల నుంచి మద్దతు లేకుండా పోయింది. దీంతో మరో దేశానికి ఆసియా క్రికెట్ కప్‌ పోటీల నిర్వహణను తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. పాకిస్థాన్ ప్రతిపాదించిన తటస్థ వేదిక ఆమోదయోగ్యం కాదని, ఒక వేళ భారత్, పాకిస్థాన్ దేశాలు ఒకే గ్రూపులో ఉంటే అపుడు మూడో జట్టు అటు పాకిస్థాన్, ఇటు యూఏఈకి చక్కర్లు కొట్టాల్సి వస్తుందని ఏసీసీ అభిప్రాయపడింది. 
 
దీంతో ఆసియా కప్ నిర్వహణ పోటీలను మరో దేశానికి తరలించాలని నిర్ణయించింది. దీంతో ఆసియా కప్ పోటీలను ఇపుడు శ్రీలంకలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, మంగళవారం జరిగే రెండో విడత చర్చల్లో ఏసీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న చిన్న ఆశలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉంది. మొత్తం మీద పీసీబీ మరో బిగ్ క్రికెట్ ఈవెంట్ నిర్వహణను కోల్పోనుంది.