1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:58 IST)

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ అదుర్స్.. సిరాజ్‌ 39 ఏళ్ల రికార్డు..!

Team India
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ అద్భుతం చేసింది. చివరిరోజు టీమిండియా పేసర్లు మాయ చేశారు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 120 పరుగులకే పరిమితం చేసి 151 పరుగుల ఘన విజయం అందించారు. దాంతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదుచేశారు. 
 
టీమిండియా 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. 
 
సిరాజ్‌ 4, బుమ్రా 3, ఇషాంత్ 2వికెట్లతో రాణించడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ జోరూట్‌ 33పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బట్లర్‌, రాబిన్‌సన్‌ వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా బుమ్రా, సిరాజ్‌ అడ్డుకట్ట వేశారు.
 
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్‌ లార్డ్స్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఎనిమిది వికెట్లలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇక లార్డ్స్‌ టెస్టులో ఒక టీమిండియా బౌలర్‌ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1882లో కపిల్‌ దేవ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. 
 
లార్డ్స్‌ వేదికగా జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో కపిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఓవరాల్‌గా 8 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం విశేషం. ఇక 2014లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు.