శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

బ్రిస్బేన్‌లో మన కుర్రోడు అదరగొట్టాడు : మంత్రి కేటీఆర్

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇపుడు బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో కంగారులను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. పైగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ 19.5 ఓవర్లు వేసి 73 రన్స్ ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఈ యువ బౌలర్ ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. "హైదరాబాదుకు చెందిన మన కుర్రాడు అదరగొడుతున్నాడంటూ" కేటీఆర్ ప్రశంసించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు. "నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పై నుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల ఖచ్చితంగా గర్విస్తాడు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.