సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:31 IST)

ధోనీ అదుర్స్.. హ్యాట్రిక్ సిక్సులు..75 పరుగులతో రెండో అత్యుత్తమ స్కోరు

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టేస్తోంది. ఈ సీజన్‌లో హాట్రిక్ విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.


ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
 
రాజస్థాన్ డట్టులో రాహుల్‌ త్రిపాఠి(39), స్మిత్‌(28), బెన్‌ స్టోక్స్‌(46)లు పోరాడినప్పటికి జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, డ్వేన్‌ బ్రేవో, శార్దూల్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

అంతకముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు(1), షేన్‌ వాట్సన్‌(13), కేదార్‌ జాదవ్‌(8)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో సురేశ్‌ రైనా-ఎంఎస్‌ ధోనిల జోడి క్రీజులో నిలదొక్కుకుంది. 
 
ఈ క్రమంలోనే ఎంఎస్‌ ధోని(75 నాటౌట్‌; 46 బంతుల్లో  4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత ధోని బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రధానంగా చివరి ఓవర్‌లో ధోని కొట్టిన హ్యాట్రిక్‌ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.

ఈ మ్యాచ్‌లో ధోని సాధించిన 75 పరుగులు అతని రెండో అత్యుత్తమ ఐపీఎల్‌ స్కోరుగా నమోదైంది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఆర్చర్‌ రెండు వికెట్లు సాధించగా, ధావల్‌ కులకర్ణి, బెన్‌స్టోక్స్‌, ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.