ఆదివారం, 24 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (16:51 IST)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో షాక్.. ఏంటది..?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతులెత్తేసింది. ఫలితంగా.. ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాకౌట్‌కు దాదాపు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. 
 
ఈ తరుణంలో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై జట్టులో ఆల్‌రౌండర్‌గా వ్యవహరిస్తూ.. డెత్ ఓవర్లలో ఉత్తమ బౌలింగ్ చేయగలిగే బ్రావో ఈ ఐపీఎల్ సీజన్ నుంచే నిష్క్రమిస్తున్నట్లు సీఎస్‌కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో బ్రావో ఇంటికి వెళ్లొచ్చని తెలిపారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్రావో లేకపోవడం గమనార్హం. 
 
కుడి గజ్జల్లో అయిన గాయంతో బ్రావో టోర్నీకి గుడ్‌బై చెబుతున్నాడు. ఇక.. సీఎస్‌కేకు ప్లేఆఫ్ ఆశలు దాదాపుగా లేనట్టే. అయితే.. ఆ జట్టుకు సాంకేతికంగా ఇప్పటికీ ప్లేఆఫ్ అవకాశాలున్నాయి. ఇప్పుడు ధోనీ సేన మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సిందే. 
 
అప్పుడు ప్లేఆఫ్స్‌కు కనీస అర్హతైన 14 పాయింట్లతో ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే తమ 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్‌ కూడా కీలకంగా మారుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ కేవలం 12 పాయింట్లు సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరింది.