1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (15:40 IST)

గజ్జల్లో గాయం... సీఎస్కే నుంచి డ్వేన్ బ్రావో నిష్క్రమణ!!

వరుస పరాజయాలను అలవాటుగా చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత జట్టులో ఓ సభ్యుడుగా ఉన్న కీలక బౌలర్ డ్వేన్ బ్రావో జట్టుకు దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా టోర్నీ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. 
 
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గతంలో ఎన్నడూ లేనివిధంగా పరమచెత్త అటతీరును కనపరుస్తోంది. ఫలితంగా ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. 
 
ఈ పరిస్థితుల్లో జట్టులో కీలమైన ఆటగాళ్ళలో ఒకడైన డ్వేన్ బ్రావో దూరం కావడం సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బే. కుడి గజ్జల్లో గాయం కారణంగా గత శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్రావో బౌలింగ్‌ను వేయలేకపోయిన విషయం తెలిసిందే. 
 
ఇదే అంశంపై ఆ జట్టు సీఈవో కాశీవిశ్వనాథన్ స్పందిస్తూ, "గాయం కారణంగా బ్రావో ఇక మ్యాచ్‌లు ఆడలేడని, ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడని" వెల్లడించాడు. 'ఐపీఎల్‌ 2020 సీజన్‌లో బ్రావో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గజ్జల్లో గాయంతో అతడు మిగతా మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్తాడని' విశ్వనాథన్‌ వివరించారు. 
 
కాగా, మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ చెన్నై ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉంది. వ్యక్తిగత కారణాలతో సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ టోర్నీ నుంచి వైదొలగడంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించడంలో విఫలమవడంతో జట్టు వరుస ఓటములు చవిచూస్తోంది.