ఐపీఎల్ 2020 : ధవాన్ అజేయ సెంచరీ.. సిక్సర్ పటేల్‌గా మారిన అక్షర్...

dealhi team victory
ఠాగూర్| Last Updated: ఆదివారం, 18 అక్టోబరు 2020 (11:40 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ధేశించిన 180 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి, మరో బంతి మిగిలివుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌కు 17 పరుగులు కావాల్సిన తరుణంలో క్రీజ్‌లో ఉన్న యువ బ్యాట్స్‌మెన్ అక్షర్ పటేల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఈ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ ఓపెనర్‌గా దిగి.. మ్యాచ్ ముగిసేంత వరకు అజేయంగా ఉండి 101 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, ఓ సిక్సర్ కూడా ఉంది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ... ధవాన్ మాత్రం తనకు ప్రత్యర్థి ఇచ్చిన మూడు నాలుగు ప్రాణదానాలను సద్వినియోగం చేసుకుని సెంచరీతో రెచ్చిపోయాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ శామ్ కరణ్ తొలి ఓవర్ మూడో బంతికే డకౌట్ అయి వెనుదిరిగినప్పటికీ డుప్లెసిస్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58, వాట్సన్ 28 బంతుల్లో 6 ఫోర్లతో 36, అంబటి రాయుడు 25 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 45, రవీంద్ర జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులతో రాణించారు. ఫలితంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

ఆ తర్వాత 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొలుత తడబడినట్టు కనిపించింది. ఓపెనర్ పృథ్వీషా తొలి ఓవర్ రెండో బంతికి డకౌట్ కాగా, 26 పరుగుల వద్ద రహానే (8) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్ (23), స్టోయినిస్ (24) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.

అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న శిఖర్ ధవన్ జట్టును విజయం దిశగా నడిపించాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం కాగా, ధవన్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్‌ను బ్రావో వేయాల్సి ఉండగా అస్వస్థత కారణంగా అతడు మైదానాన్ని వీడటంతో ధోనీ బంతిని స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ఇచ్చాడు.

అయితే, ధవన్ ఎదుర్కొన్న తొలి బంతి వైడ్ కాగా, ఆ తర్వాతి బంతికి సింగిల్ వచ్చింది. ఇంకా విజయానికి 5 బంతుల్లో 15 పరుగులు అవసరం. రెండో బంతిని అక్సర్ పటేల్ స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని కూడా అక్సర్ సిక్సర్‌గా మలచడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయడంతో మ్యాచ్ టై అయింది. అయితే, ఐదో బంతిని అక్సర్ మరోమారు స్టాండ్స్‌కు తరలించడంతో మ్యాచ్ ఢిల్లీ వశమైంది.

5 బంతులు మాత్రమే ఆడిన అక్సర్ పటేల్ 3 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. అంతకుముందు ధవన్‌ మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 21, 50, 79 పరుగుల వద్ద అతడిచ్చిన క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు నేలపాలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ధవన్‌కు "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్" అవార్డు దక్కింది. కాగా, ఆదివారం హైదరాబాద్ - కోల్‌కతా, ముంబై - పంజాబ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.దీనిపై మరింత చదవండి :