శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:12 IST)

ఐపీఎల్ 2020 : సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న దినేష్ కార్తీక్! (వీడియో)

ఐపీఎల్ 2020 ఫ్రాంచైజీల్లో జట్లలో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు. ఈ జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఈ జట్టు ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడితే అందులో నాలుగు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ఈ పరిస్థితుల్లో సారథ్య బాధ్యతల నుంచి దినేష్ కార్తీక్ తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై మరింతగా దృష్టిసారించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. 
 
అదేసమయంలో దినేష్ కార్తీక్ స్థానంలో ఇయాన్ మోర్గాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కొత్త కెప్టెన్‌గా నియమితుడైన మోర్గాన్‌కు కార్తీక్ శుభాకాంక్షలు తెలిపాడు. మోర్గాన్ నాయకత్వంలో కోల్‌కతా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. 
 
కాగా, కోల్‌కతా జట్టు నేడు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బలమైన ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. దినేశ్ కార్తీక్ నిర్ణయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో స్పందించారు. 
 
డీకే (దినేశ్ కార్తీక్) వంటి ముందుండి నడిపించే వ్యక్తులు జట్టులో ఉండడం తమ అదృష్టమన్నారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డీకే భావించేవాడన్నారు. అతని నిర్ణయం తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.
 
అయితే, డీకే మనోభావాలను తాము గౌరవిస్తామని, కొత్త కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపడుతున్నాడని వెంకీ మైసూర్ వెల్లడించారు. 2019 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాడు ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు వివరించారు.