శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (11:39 IST)

క్రిస్ గేల్ రాకతో "పంజాబ్ జిగేల్" ... వరుస ఓటములకు బ్రేక్!

యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి కింగ్స్ లెవెన్ పంజాబ్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులోకి వచ్చిన వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్.. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ సాధించి పంజాబ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంటే క్రిస్ గేల్ రాకతో పంజాబ్ దశ తిరిగిపోయింది. వరుస ఓటములకు ఈ విజయంతో చెక్ పెట్టింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ 20, పడిక్కల్ 18, సుందర్ 13, శివం దూబే 23, క్రిస్ మోరిస్ 25, ఉడానా 10 పరుగులు చేయగా, ఫామ్‌లో ఉన్న కోహ్లీ 39 బంతుల్లో 3 ఫోర్లతో 48 పరుగులు చేసి అర్థ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 
 
మరో కీలక బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ (2) నిరాశపరిచాడు. సుందర్‌ ఔటయ్యాక కూడా డివిలియర్స్‌కు బదులు శివమ్‌ దూబే (23) క్రీజులోకి రావడంతో కోహ్లీ సేన ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్‌ (2), కోహ్లీలను షమీ మూడు బంతుల వ్యవధిలో ఔట్‌ చేశాడు. ఫలితంగా 171 పరుగులు మాత్రమే చేసింది. 
 
ఆ తర్వాత మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు మరోసారి దంచికొట్టడంతో పంజాబ్‌ ఛేజింగ్‌ సాఫీగా సాగింది. రాహుల్‌, మయాంక్‌ పోటీపడి పరుగులు రాబట్టడంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించాక మయాంక్‌ ఔట్‌ కాగా.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న గేల్‌ క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు.
 
పైగా, లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడిన క్రిస్‌.. ఆ తర్వాత రాహుల్‌తో కలిసి భారీ సిక్సర్లతో బెంగళూరు బౌలర్ల భరతం పట్టాడు. అయితే, చివరి ఓవర్‌లో చాహల్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్‌లో పంజాబ్ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా, ఉత్కంఠ చివరి బంతి వరకు కొనసాగింది. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ కాగా, మూడో బంతికి గేల్ సింగిల్ రన్ తీశాడు. దీంతో మూడు బంతుల్లో విజయానికి ఓ పరుగు అవసరం. నాలుగో బంతి డాట్ బాల్ కాగా ఐదో బంతికి రాహుల్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. దీంతో గేల్ రనౌట్ అయ్యాడు.
 
ఇప్పుడు అందరిలోనూ ఒకే టెన్షన్. చివరి బంతికి సింగిల్ తీస్తే విజయం పంజాబ్‌ను వరిస్తుంది. లేకుంటే మ్యాచ్ టై అవుతుంది. క్రీజులోకి వచ్చిన పూరన్ ఏం చేస్తాడోనని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే, పూరన్ మాత్రం చివరి బంతిని సిక్సర్‌గా మలిచి పంజాబ్ టెన్షన్‌ను దూరం చేశాడు. 49 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గేల్ 45 బంతుల్లో ఫోర్, ఐదు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఫలితంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
అయితే, పంజాబ్ గెలుపు, బెంగళూరు ఓటములతో పాయింట్ల పట్టికలో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు. కోహ్లీసేన 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఈ విజయంతో మరో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ పంజాబ్ మాత్రం అట్టడుగునే ఉంది. క్రిస్ గేల్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఫాంలోకి రావడం ఆ జట్టుకు భారీ ఊరటగా చెప్పుకోవచ్చు.