మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (11:22 IST)

టోక్యో ఒలింపిక్స్‌.. క్రికెటర్ కొడుకు ఖాతాలో సిల్వర్ మెడల్

టోక్యో ఒలింపిక్స్‌లో ఓ దిగ్గజ క్రికెటర్ కొడుకు మెడల్ సాధించాడు. అథ్లెటిక్స్‌లో మంగళవారం జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో అమెరికా అథ్లెట్ రాయ్ బెంజమిన్ సిల్వర్ మెడల్ సాధించాడు.

46.17 సెకన్ల టైమింగ్‌తో అతను రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ విన్‌స్టన్ బెంజమిన్ కుమారుడే ఈ రాయ్ బెంజమిన్. 1986-95 మధ్య కాలంతో తన భీకర పేస్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించిన విన్‌స్టన్ బెంజమిన్ తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో వెస్టిండీస్‌ తరపున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడాడు.

రెండు ఫార్మాట్లలో కలిపి 161 వికెట్లు తీశాడు.న్యూయార్క్‌లో పుట్టిన రాయ్ బెంజిమెన్ 2019 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ గెలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ ఆదివారం జరిగిన పురుషుల హై జంప్‌లో ఐదో స్థానంలో నిలిచి తృటిలో మెడల్ కోల్పోయాడు.

మరోవైపు మంగళవారం జరిగిన హాకీ సెమీస్‌లో అనూహ్యంగా పదే పదే పెనాల్టీలు ఇచ్చి భారత్ ఓటమికి పరోక్షంగా కారణమైన అంపైర్ కోన్ బుంగ్ వాన్ (నెదర్లాండ్స్) సోదరుడు డాన్ బుంగ్ వాన్ సైతం అంతర్జాతీయ క్రికెటరే. నెదర్లాండ్స్‌కు అతను 37 వన్డేలు, 14 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో హెర్షల్ గిబ్స్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదింది ఇతని బౌలింగ్‌లోనే.
 
హర్డిల్స్‌లో నార్వే అథ్లెట్‌ కర్‌స్టెన్‌ వార్హోమ్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. తన పేరు మీదే ఉన్న రికార్డును టోక్యోలో మెరుగుపరుస్తూ పసిడి పట్టాడు. 46 సెకన్లలోపే రేసు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. మంగళవారం హోరాహోరీ ఫైనల్లో అతను.. 45.94 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
 
బెంజమిన్‌ (అమెరికా- 46.17సె), సాంటోస్‌ (బ్రెజిల్‌- 46.72సె) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ వార్హోమ్‌ 35 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ప్రపంచ రికార్డును రెండు సార్లు బద్దలు కొట్టడం విశేషం. ఈ 25 ఏళ్ల అథ్లెట్‌ గత నెల 1న 46.70 సెకన్ల టైమింగ్‌తో తొలిసారి ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.