మంగళవారం, 2 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం వైజాగ్

vizag cricket stadium
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వైజాగ్ వేదికగా వన్డే మ్యాచ్ జరుగనుంది. అలాగే, ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై భారత్ ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. భారత క్రికెట్‌ జట్టు సెప్టెంబరు నుంచి ఆరు నెలల వ్యవధిలో సొంతగడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖరారు చేసింది. ఈ షెడ్యూల్‌లో భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌లో ప్రాధాన్యం దక్కని నగరాల్లోని వేదికలకు పెద్ద పీట వేస్తూ మ్యాచ్‌లను ఖరారు చేసింది. 
 
ప్రపంచకప్‌ ఆతిథ్య అవకాశమే దక్కని వైజాగ్‌కు, ఆ టోర్నీలో భారత్‌ మ్యాచ్‌ దక్కించుకోలేకపోయిన హైదరాబాద్‌కు రెండేసి మ్యాచ్‌లను బీసీసీఐ కేటాయించింది. అక్టోబరులో ప్రపంచకప్‌ ఆరంభంకానుండగా.. దానికి ముందు ఆడే టీమ్‌ఇండియా చివరి వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. సెప్టెంబరు 22, 24, 27 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్‌లకు మొహాలి, ఇండోర్, రాజ్‌కోట్‌ ఆతిథ్యమిస్తాయి. 
 
ప్రపంచకప్‌ ముగిశాక ఆసీస్‌తోనే భారత జట్టు ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతుంది. నవంబరు 23న తొలి మ్యాచ్‌కు విశాఖపట్నం, డిసెంబరు 3న చివరి టీ20కి హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తాయి. నవంబరు 26, 28, డిసెంబరు 1 తేదీల్లో మిగతా టీ20లు తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పుర్‌లలో జరుగుతాయి. 
 
దీని తర్వాత ఆప్ఘనిస్థాన్‌తో జనవరి 11, 14, 17 తేదీల్లో భారత్‌ ఆడే మూడు టీ20ల సిరీస్‌కు మొహాలి, ఇండోర్, బెంగళూరు ఆతిథ్యమిస్తాయి. అదే నెల చివర్లో ఇంగ్లండ్‌తో ఐదు సిరీస్‌ మొదలవుతుంది. జనవరి 25-29 తేదీల్లో తొలి టెస్టు హైదరాబాద్‌లో, ఫిబ్రవరి 2-6 మధ్య రెండో టెస్టు విశాఖలో జరుగుతాయి. తర్వాతి మూడు టెస్టులకు రాజ్‌కోట్‌, రాంచి, ధర్మశాల వేదికలుగా ఖరారయ్యాయి.