శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2016 (18:01 IST)

ఆస్ట్రేలియా గడ్డపై ట్వంటీ-20 సిరీస్ నెగ్గిన టీమిండియా: 27 పరుగుల తేడాతో విన్

ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. వరల్డ్ కప్ ట్వంటీ-20 ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కంగారూలతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోవడంతో ధోనీ జట్టుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన టీమిండియా ట్వంటీ-20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో భారత జట్టు తిరుగులేని విధంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడం ద్వారా సిరీస్ గెలుచుకుంది. 
 
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ధావన్ (42), రోహిత్ శర్మ (60) శుభారంభాన్నిచ్చారు. అనంతరం బరిలోకి దిగిన కోహ్లీ (59) మరింత ధాటిగా ఆడడంతో ధోనీ (14) సహకారంతో జట్టు స్కోరును మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఓపెనర్లు అరోన్ ఫించ్ (74), షాన్ మార్ష్ (23) విజృంభించారు. టీమిండియా పేసర్లను ఆటాడుకున్నారు. తద్వారా ఆస్ట్రేలియా గెలుపు సులభమనిపించింది. కానీ అశ్విన్, జడేజా బౌలింగ్‌లో సత్తా చాటడం, మార్ష్‌ను అశ్విన్ పెవిలియన్ బాటపట్టించడంతో ఆసీస్ పతనం మొదలైంది. 
 
ఈ క్రమంలో లిన్ (2), మ్యాక్స్ వెల్ (1), షేన్ వాట్సన్ (15), జేమ్స్ ఫాల్కనర్ (10), జాన్ హేస్టింగ్స్ (4), టై (4)లు వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా రెండు, అశ్విన్, పాండ్య, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. ఫలితంగా 27 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.