గురువారం, 14 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (22:47 IST)

ఉప్పల్ స్టేడియంలో ఆసీస్ చిత్తు : సిరీస్ భారత్ కైవసం

team india
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా చిత్తైంది. ఆసీస్ ఆటగాళ్లు నిర్ధేశించిన 187 పరుగుల విజలక్ష్యాన్ని టీమిండియా ఆటగాళ్లు మరికొన్ని బంతులు మిగిలివుండగానే ఛేదించేరా. ఈ విజయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కీలక పాత్ర పోషించారు. 
 
ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగగా, ఆ జట్టు ఆటగాళ్లు కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ అర్థసెంచరీలతో రాణించారు. దాంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. 
 
ఓపెనర్‌గా బరిలో దిగిన ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్ శిబిరంలో ఆందోళన కలిగించాడు. గ్రీన్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. అయితే గ్రీన్‌ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. 
 
అంతకుముందే కెప్టెన్ ఫించ్ (7) ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. స్మిత్ 9, మ్యాక్స్ వెల్ 6 పరుగులు చేసి అవుటయ్యారు. అయితే టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (24) జోడీ ఆసీస్‌ను ఆదుకుంది.
 
ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆఖరి ఓవర్లలో విజృంభించాడు. ఈ పొడగరి బ్యాట్స్‌మన్ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. దూకుడుగా ఆడే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (1) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 
 
మ్యాచ్ ఆఖరులో ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ (20 బంతుల్లో 28 నాటౌట్) కీలకమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఆసీస్ కు భారీ స్కోరు సాధ్యమైంది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, భువనేశ్వర్ కుమార్ 1, యజువేంద్ర చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. 
 
అనంతరం, 187 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్... డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రోహిత్ శర్మ కూడా (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 
 
ఆ సమయంలో కోహ్లీ (54)తో జతకలిసిన సూర్య కుమార్ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 36 బంతులను ఎదుర్కొన్న సూర్య ఐదు సిక్స్‌లు ఐదు ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు. ఆ సమయంలో హాజల్‌వుడ్ వేసిన బంతికి భారీ షాట్ కోసం ప్రయత్నించి ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిగిరాడు. 
 
అప్పటికి జట్టు స్కోరు 13.6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, కోహ్లీలు కలిసి జాగ్రత్తగా ఆడి జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 63 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 19.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 
 
చివరి నాలుగు బంతులకు ఐదు రన్స్ కావాల్సిన తరుణంలో దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలు కలిసి జట్టుకు విజయం చేకూర్చిపెట్టారు. మరో బంతి మిగిలివుండగానే నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆసీస్ బౌలర్లలో శ్యామ్స్ 2, హాజల‌్‌వుడ్, కుమ్మిన్స్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.