సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (17:07 IST)

భారత పర్యటనకు ఆస్ట్రేలియా ఓకే... భార్యలు - ప్రియురాళ్లకు అనుమతి నో!!

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు ట్వంటీ20 మ్యాచ్‌లను భారత్ ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో ఆడనుంది. ఈ సిరిస్ కోసం తమ దేశానికి వచ్చేందుకు టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 
 
ప్రస్తుతం భారత క్రికెటర్లంతా దుబాయ్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీని ఆడుతున్నారు. వీరిలో పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు దుబాయ్ నుంచే సిడ్నీకి బయలుదేరి వెళుతారు. అక్కడ రెండు వారాల పాటు హోం క్వారంటైన్‍లో ఉంటారు. 
 
కాగా, ఈ టూర్‌లో న‌వంబ‌ర్ 27వ తేదీ నుంచి మొద‌ట వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న‌ది. అన్ని వ‌న్డే మ్యాచ్‌ల‌ను సిడ్నీలోనే ఆడ‌నున్నారు. ఆ త‌ర్వాత మూడు టీ20 మ్యాచ్‌ల కోసం క్యాన్బెరా ప్ర‌యాణిస్తారు. డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. అడిలైడ్‌లో ఈ టెస్టు డే అండ్ నైట్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌నున్న‌ది. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టును నిర్వ‌హించ‌నున్నారు. సిడ్నీ, బ్రిస్బేన్‌లో మిగితా రెండు టెస్టులు ఆడుతారు.
 
అయితే, ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టుకు క్వారెంటైన్ ప్రోటోకాల్‌ను న్యూసౌత్ వేల్స్ ప్ర‌భుత్వం ఆమోదించింది. జ‌ట్టు బృందంతో ఆట‌గాళ్ల భార్య‌లు, గ‌ర్ల్‌ఫ్రెండ్ల‌ను అనుమ‌తించ‌డం లేదు. ప్రస్తుతం వీరంతా ఐపీఎల్ పోటీలు జరుగుతున్న యూఏఈలో తమ భర్తలు, బాయ్‌ఫ్రెండ్స్‌తో గడుపుతున్నారు.