బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జనవరి 2025 (10:18 IST)

సిడ్నీ టెస్టులో చిత్తుగా ఓడిపోయిన భారత్... బీజీ ట్రోఫీ ఆసీస్ కైవసం

australia
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్ - గావస్కర్ కంగారుల వశమైంది. సిరీస్‌తోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తును ఆసీస్ ఖాయం చేసుకుంది. మరోవైపు సిరీస్ ను కోల్పోవడమేకాకుండా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలనే భారత్ ఆశలు గల్లంతయ్యాయి.
 
రసవత్తరంగా మారుతుందని భావించిన సిడ్నీ టెస్టులో ఎలాంటి అద్భుతం జరగలేదు. బుమ్రా బౌలింగ్ చేయకపోవడంతో ఆసీస్ ఎదుట ఉంచిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా కేవలం 27 ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేయగా.. ఆసీస్ 181 పరుగులకు పరిమితమైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌కు టీమ్ ఇండియా 157 పరుగులకు పరిమితమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్కాట్ బోలాండ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా జస్ప్రీత్ బుమ్రా అవార్డులు సాధించారు.
 
బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్‌పై ఆసీస్ ఓపెనర్లు ఎదురు దాడికి దిగారు. యువ ఓపెనర్ సామ్ కొన్స్ (22) వచ్చీ రావడంతోనే దూకుడు ప్రదర్శించాడు. ప్రధాన పేసర్ సిరాజ్ కూడా ఆరంభంలో లెగ్ సైడ్ బంతులు వేయడంతో ఆసీస్ పని ఇంకా సులువైంది. మొదటి రెండు ఓవర్లలోనే 26 పరుగులను ఆసీస్ ఓ పెర్లు రాబట్టారు. 
 
అయితే, ప్రసిధ్ కృష్ణ (3/65) స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి ఆసీస్పై ఒత్తిడి పెంచాడు. ఉస్మాన్ ఖవాజా (41) హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సిరాజ్ (1/69) బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, ట్రావిస్ హెడ్ (34 నాటౌట్), వెబ్‌స్టర్ (39 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. స్టీవ్ స్మిత్ (4), మార్నస్ లబుషేన్ (6) విఫలమయ్యారు.
 
ఆసీస్‌తో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు రాలేదు. ఇదే భారత్‌కు ఇబ్బందికి గురి చేసింది. సిరాజ్, ప్రసిద్, నితీష్‌తో కూడిన పేస్ విభాగం ఆసీస్‌‍ను అడ్డుకోలేకపోయింది. అదే బుమ్రా ఉండుంటే. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించేవారు కాదు. 
 
అప్పటికీ త్వరగానే మూడు వికెట్లను పడగొట్టినా.. ఖవాజా హెడ్, వెబ్‌‍స్టర్‌ను కట్టడి చేయలేకపోయారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బుమ్రా 32 వికెట్లు తీశాడు. ఇపుడు కీలక సమయంలో బుమ్రా సేవలు లేకపోవడంతో సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని భారత్‍‌ చేజార్చుకుంది.