Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అదుర్స్ రికార్డ్.. 200 వికెట్ల మైలురాయి
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. 8484 బంతుల్లోనే బుమ్రా 200 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్, బర్త్‌డే బాయ్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా 200వ టెస్ట్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డ్‌ను బుమ్రా అధిగమించాడు. కపిల్ దేవ్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు పడగొడితే బుమ్రా 44 టెస్ట్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితమైన సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో 116 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన చేయడంతో, ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. 39 ఓవర్లు ముగిసే సమయానికి, ఆస్ట్రేలియా కేవలం 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత పేసర్లలో బుమ్రా ఆరో స్థానంలో నిలిచాడు.
జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన కచ్చితత్వంతో భారత బౌలింగ్ దాడిని నడిపించాడు. నాలుగు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేస్తూ అతనికి సమర్థవంతంగా మద్దతు ఇచ్చాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో మార్నస్ లాబుషాగ్నే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.