సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (18:33 IST)

అశ్విన్ స్థానంలో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్!!

tanush kotian
భారత క్రికెట్ జట్టుకు దిగ్గజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, అతని స్థానంలో తమిళనాడుకే చెందిన తనుశ్ కోటియన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం ముంబై జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీలో తనుశ్ ఆడుతూ అహ్మదాబాద్‌లో ఉన్నాడు. ఇపుడు భారత క్రికెట్ జట్టుకు ఎంపిక చేయడంతో తనుశ్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చేరుకునే అవకాశం ఉంది. 
 
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరుగగా, నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26వ తేదీ నుంచి జరుగనుంది. అయితే, మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌‍కు వీడ్కోలు పలికాడు. దీంతో అతని స్థానంలో తనుశ్‌ను ఎంపిక చేశాడు. 
 
గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలకు బ్యాకప్ కోటియన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
 
కాగా, 26 ఏళ్ల తనుశ్ కోటియన్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. అలాగే 47 ఇన్నింగ్స్‌లో 41.21 సగటుతో రెండు సెంచరీలు, 13 అర్థసెంచరీలతో 1,525 పరుగులు చేశాడు. అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ పర్యటనలో ఒక మ్యాచ్ కూడా ఆడాడు. అందులో 44 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు.
 
అటు ముంబై జట్టు 2023-24 రంజీ ట్రోఫీ సీజన్‌లో టైటిల్ గెలవడంలో కోటియన్ కీలక పాత్ర పోషించాడు. సీజన్ మొత్తంలో 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. అలాగే 16.96 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. ఇలా అద్భుతమైన ఆల్ రౌండర్ షోతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. లిస్ట్-ఏ, టీ20ల్లోనూ మంచి గణాంకాలను కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోటియన్‌కు అనూహ్యంగా టీమిండియా టెస్టు జట్టులో చోటుదక్కింది. 
 
ఆసీస్‌తో జరిగే  తుది రెండు చట్ల కోసం భారత జట్టు.. 
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, తనుశ్ కోటియన్.