సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (15:11 IST)

సిడ్నీ వన్డే.. ఆదుకున్న ధోనీ, రోహిత్.. హిట్ మ్యాన్ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ వన్డేలో భారత్ లక్ష్య చేధన కోసం మల్లగుల్లాలు పడుతోంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోగి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే తడబడింది. కేవలం నాలుగు పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ, ధోనీ ఆదుకున్నారు. సూపర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు అండగా వున్నారు. 
 
విరాట్ కొహ్లీ విఫలమవ్వడంతో పాటు రాయుడు, ధావన్ డకౌటవ్వడంతో చేజింగ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. కోహ్లీ కూడా రిచర్డ్‌సన్ బౌలింగ్‌తో స్టోయినిస్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు సైతం డకౌట్ అయ్యాడు. దీంతో  4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. తదనంతరం తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ, ఓపెనర్ రోహిత్‌తో కలిసి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. 
 
రోహిత్‌ తనదైన శైలిలోనే దూకుడుగా ఆడగా...ధోనీ డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 17 ఓవర్లలో భారత్ 50 పరుగుల మార్క్ దాటగలిగింది. రోహిత్ వన్డేల్లో 38వ అర్థసెంచరీ నమోదు చేశాడు. అయితే ధోనీ (51 పరుగులు.. మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో) కూడా అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాక బెహ్రెడోఫ్‌ బంతికి ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 
 
ప్రస్తుతం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 112 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 102 పరుగులు సాధించి జట్టుకు అండగా క్రీజులో కొనసాగుతున్నాడు. ఇతనికి జడేజా భాగస్వామ్యం అందిస్తున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.