శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (10:30 IST)

సిడ్నీ టెస్ట్ : విజృంభించిన కుల్దీప్ .. ఫాలోఆన్ ఆడుతున్న ఆస్ట్రేలియా

సిడ్నీ టెస్టులో భారత బౌలర్ కుల్దీప్ సింగ్ విజృంభించారు. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఫాలోఆన్ ఆడుతోంది. మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 236/6తో నాలుగో రోజు ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును బౌలర్ కుల్దీప్ సింగ్ కుప్పకూల్చాడు. తన మణికట్టు మాయాజాలానికి ఆసీస్ జట్టు కేవలం 300 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్‌కు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 
 
వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కమ్మిన్స్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఆసీస్ టెయిలెండర్లు కాసేపు పోరాటం చేశారు. ఓవర్‌‌నైట్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్‌కోంబ్(37)తో పాటు, స్టార్క్(29 నాటౌట్), హజెల్‌వుడ్(21) రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అతడికిది రెండో ఐదు వికెట్ల ప్రదర్శన. మిగిలిన బౌలర్లలో షమీ, జడేజా రెండు బూమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
 
ఇకపోతే, ఆటకు నాలుగు సెషన్లు మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉండటంతో భారత కెప్టెన్ కోహ్లీ.. ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ప్రస్తుతం ఆసీస్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. ఖవాజా 4, హ్యారీస్ ఖాతా తెరకుండా క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ 318 పరుగులు వెనుకబడి ఉంది.