భారత బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న కంగారులు.. ముగ్గురు డకౌట్
ఐసీసీ ప్రపంచ వన్డే కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. ఫలితంగా ముగ్గురు ఆటగాళ్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. వీరిలో ఓపెనర్ల రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
ఈ మూడు వికెట్లు భారత్ స్కోరు రెండు పరుగుల వద్ద ఉండగా కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, స్టార్క్ ఒక వికెట్ తీసి భారత్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా తృటిలో అవుట్ గండం నుంచి తప్పించుకున్నాడు. కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్లు జారవిరచడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం 17.2 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కోహ్లీ 34, కేఎల్ రాహుల్ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
అంతముందు భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఆసీస్ 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఎదుట 200 పరుగుల లక్ష్యం ఉంది. స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్. డేవిడ్ వార్నర్ (41), మార్నస్ లబుషేన్ (27), మ్యాక్స్‌వెల్ (15), పాట్ కమిన్స్ (15) పరుగులు చేశారు. మిచెల్ మార్ష్ (0), అలెక్స్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
చివర్లో మిచెల్ స్టార్క్ (28; 35 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో ఆసీస్ ఆ మాత్రమైనా పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/28), కుల్‌దీప్ యాదవ్ (2/42), జస్‌ప్రీత్ బుమ్రా (2/35), అశ్విన్ (1/34) ఆసీస్‌ను కట్టడి చేశారు. సిరాజ్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.