1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2023 (13:16 IST)

ప్రపంచ రికార్డుకు మూడు సిక్స్‌ల దూరంలో రోహిత్ శర్మ

rohit sharma
భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుకు మరో మూడు సిక్స్‌ల దూరంలో ఉన్నారు. ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్‌ను సాధిస్తారని ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 
 
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటివరకు 551 సిక్సులు కొట్టాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సులు కొట్టాడు. 
 
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో 3 సిక్సులు కొడితే క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. దీంతో నేడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లోనే రోహిత్ ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 
అలాగే రోహిత్ శర్మ మరో 8 సిక్సులు కొడితే వన్డేల్లో 300 సిక్సులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఫార్మాట్‌లో 300 సిక్సులు కొట్టిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇతర ఆటగాళ్లు కూడా పలు మైలురాళ్లను చేరుకునే అవకాశాలున్నాయి.
 
టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 83 పరుగులు చేస్తే వన్డేల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. గిల్ ప్రస్తుతం 1917 పరుగులు చేశాడు. 
 
యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరో 114 పరుగులు చేస్తే వన్డేల్లో 1,000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 10 ఫోర్లు కొడితే వన్డేల్లో 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు.
 
టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో 5 వికెట్లు తీస్తే స్వదేశంలో వన్డేల్లో 100 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.
 
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ మరొక 7 పరుగులు చేస్తే వన్డేల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. మాక్స్‌వెల్ ఇప్పటివరకు 5,993 పరుగులు చేశాడు.
 
ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినీస్ మరో 5 సిక్సులు కొడితే వన్డేల్లో 50 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.