చెన్నై చెపాక్ స్టేడియంలో కంగారులను వణికించిన భారత బౌలర్లు.. టార్గెట్ 200 రన్స్
ఐసీసీ ప్రపంచ వన్డే కప్ మెగా టోర్నీలో భాగంగా, ఆదివారం ఆతిథ్య భారత్‌తో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులకు భారత బౌలర్లు తగిన రీతిలో కళ్లెం వేశారు. భారత స్నిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ జట్టును 199 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా భారత్ ముంగిట 200 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచారు. అలాగే, డేవిడ్ వార్నర్ (41), మార్నస్ లబుషేన్ (27), మ్యాక్స్‌వెల్ (15), పాట్ కమిన్స్ (15) పరుగులు చేశారు. మిచెల్ మార్ష్ (0), అలెక్స్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. చివర్లో మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేయడంతో ఆసీస్ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/28), కుల్‌దీప్ యాదవ్ (2/42), జస్‌ప్రీత్ బుమ్రా (2/35), అశ్విన్ (1/34) ఆసీస్‌ను కట్టడి చేశారు. సిరాజ్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.