శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2023 (10:13 IST)

ప్రపచం వన్డే కప్ : చెన్నై వేదికగా భారత్ - ఆస్ట్రేలియా సమరం

ind vs aus
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా ఆతిథ్య భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ నెల 5వ తేదీన ఈ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లు అభిమానుల్లో అంతగా జోష్ నింపలేక పోయాయి. 
 
దీనికి కాణం టీమిండియా ఇంకా బరిలోకి దిగకపోవడమే. ఇక ఆ సమయం వచ్చేసింది. ఆదివారం నుంచి రోహిత్ సేన తమ మూడో టైటిల్ కోసం వేట ఆరంభించనుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారీ అంచనాల మధ్య తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 
 
అయితే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే భారత్ ప్రధాన మ్యాచ్‌ను ఆడబోతోంది. వర్షంతో రెండు వామప్ మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఇంతకుముందే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్ ను 2-1తో గెలుచుకోవడం సానుకూలాంశం కానుంది. మరోవైపు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూలు తమ చివరి ఆరు వన్డేల్లో ఒక్కసారి మాత్రమే గెలిచారు.
 
ఇదిలావుంటే, గిల్ అనారోగ్యం గురించి బీసీసీఐ స్పష్టత ఇవ్వకపోయినా తను ఈ మ్యాచ్ ఆడడం కష్టమే. అతడి స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు ఇషాన్ సిద్దంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్ మరో ఆప్షన్ కనిపిస్తున్నా కెప్టెన్ రోహిత్‌తో కలిసి కుడి, ఎడమచేతి కాంబినేషన్ వైపే మొగ్గు చూపనున్నారు. వన్ డౌన్‌లో విరాట్ ఆ తర్వాత శ్రేయాస్, రాహుల్ మిడిలార్డర్‌లో జట్టును ఆదుకునే ప్రయత్నం చేయనున్నారు. 
 
ప్రస్తుత జట్టులో చెపాక్‌లో సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కావడం విశేషం. ఫినిషర్‌గా హార్దిక్ ఉపయోగపడనున్నాడు. ఇక చెపాక్ పిచ్ స్వభావానికి అనుగుణంగా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 
 
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, విరాట్, శ్రేయాస్, రాహుల్, హార్టిక్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మార్ష్, స్మిత్, లబు షేన్, మార్వెల్, గ్రీన్, అలెక్స్ క్యారీ, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, ఆడమ్ జంపా, హాజెల్‌వుడ్.
 
పిచ్, వాతావరణం
శనివారం సాయంత్రం చెన్నైలో భారీ వర్షం కురిసింది. నేడు కూడా ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. అయితే కేవలం పది శాతం మాత్రమే వర్షం కురిసేందుకు అవకాశం ఉండడంతో మ్యాచ్‌కు ఇబ్బందిలేదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించవచ్చు.