గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (11:18 IST)

ఇదేంటి.. ఆర్మీ క్యాప్‌లు ధరించి క్రికెట్ ఆడుతారా? పాకిస్థాన్ ఫైర్

రాంచీ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కంగారూల చేతిలో ఖంగుతింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లను ధరించడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. ఆ జవాన్ల మృతికి నివాళిగా భారత జట్టు రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్‌లను ధరించింది. 
 
ఇలా టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్ ధరించడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రికెట్‌ను రాజకీయం చేస్తున్న బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ సమాచారశాఖ మంత్రి ఫావద్ చౌదరీ తెలిపారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌లు ధరించిన అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాలని మంత్రి ఫావద్ పాక్ క్రికెట్ బోర్డును కోరాడు. ఆర్మీ క్యాప్‌లు ధరించి క్రికెట్ ఆడడం సరికాదని ఫావద్ వెల్లడించారు. 
 
అయితే ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వన్డేలో ఆర్మీ క్యాప్ ఎందుకు ధరించామో కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి‌లో అసువులు బాసిన వీర జవాన్లకి నివాళిగా ఈ క్యాప్‌ ధరించినట్లు టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. 
 
బీసీసీఐ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్‌లను భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకి అందజేశారు. అంతేగాకుండా మూడో వన్డే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తున్నట్లు టీమిండియా ప్రకటించింది.