1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (16:31 IST)

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ : అహ్మదాబాద్‌లో డే అండ్ నైట్ టెస్ట్

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు వచ్చే యేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ జట్లు నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం రిలీజ్ చేసింది. 
 
ఈ పర్యటన వచ్చే యేడాది ఫిబ్రవరి నెల ఏడో తేదీ నుంచి ప్రారంభంకానుంది. అయితే అహ్మ‌దాబాద్‌లో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన నుంచి రెండు జ‌ట్ల మ‌ధ్య డే అండ్ నైట్ టెస్టును నిర్వహించేలా ప్లాన్ చేశారు. 
 
కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో టీమిండియా ఆడాల్సిన పలు క్రికెట్ సిరీస్‌లు వాయిదాపడిన విషయం తెల్సిందే. తొలుత మార్చిలో సౌతాఫ్రికా జ‌ట్టుతో జ‌ర‌గాల్సిన సిరీస్‌ను ర‌ద్దు చేశారు. ఆపై ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను దుబాయ్‌లో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. 
 
అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ అంతర్జాతీయ పర్యటనలు పునఃప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగానే టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అలాగే, ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రానుంది. ఇంగ్లండ్‌తో జ‌రిగే డే అండ్ నైట్ టెస్ట్ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో జ‌రుగుతుంద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా తెలిపారు.