సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (08:40 IST)

స్పిన్ ఉచ్చులోపడి... దాయాది దేశంపై భారత్ రికార్డు విజయం...

India_Pakistan
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, సోమవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా, దాయాది దేశంపై తొలిసారి 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత 357 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉచ్చులో పడి వరుసగా వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ ఏకంగా ఐదుగురు పాక్ ఆటగాళ్ళను ఔట్ చేశాడు. 
 
కానీ, ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించినప్పటికీ సడలని ఏకాగ్రతతో ఆడిన భారత్... అన్ని రంగాల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. నిజానికి ఈ మ్యాచ్ ఆదివారమే జరగాల్సింది. వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహించారు. ఈ సూపర్-4 సమరంలో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. అది ఎంత పొరపాటు నిర్ణయమో భారత్ బ్యాటింగ్ జోరు చూస్తేనే అర్థమైంది. టాపార్డర్ రాణింపుతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 356 పరుగులు చేసి పాక్‌కు సవాల్ విసిరింది. అయితే ఛేదనలో పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. 
 
అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ (56), శుభ్ మాన్ గిల్ (58) తొలి వికెట్ కు 121 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా, ఆ తర్వాత కోహ్లి, కేఎల్ రాహుల్ జోడీ పాక్ బౌలింగ్ ను ఊచకోత కోసింది. ఈ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగులు జోడించే క్రమంలో సెంచరీలతో కదం తొక్కింది. కోహ్లి 122, కేఎల్ రాహుల్ 111 పరుగులు చేశారు.
 
లక్ష్యఛేదనలో పాక్ ను భారత బౌలర్లు కకావికలం చేశారు. ముఖ్యంగా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ వెన్ను విరిచాడు. చివర్లో నసీమ్ షా, హరీస్ రవూఫ్ గాయాల కారణంగా బ్యాటింగ్ కు దిగలేదు. 8 వికెట్లు పడిన తర్వాత పాక్ ఆలౌట్ అయినట్టు ప్రకటించారు. బుమ్రా 1, పాండ్యా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ సూపర్-4 దశలో అగ్రస్థానానికి చేరింది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను శ్రీలంకతో రేపు (సెప్టెంబరు 12) ఆడనుంది.