సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (07:52 IST)

సౌతాఫ్రికా టూర్ : రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ వృథా.. ఓటమితో భారత్ జర్నీ ప్రారంభం

team india
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించింది. వర్షం కారణంగా తొలి టీ20 జట్టు రద్దు అయింది. మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీల చేతిలో టీమిండియా ఓడిపోయింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన రెండవ టీ20 మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది.
 
భారత ఆటగాడు రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్ వృథా పోగా.. లక్ష్య ఛేదన చివరిలో చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్క్‌రమ్, హెండ్రిక్స్ ఆతిథ్య జట్టును విజయ తీరాలకు చేర్చారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌‍కు అంతరాయం కలిగింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లకు 152 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే ఛేదించారు.
 
దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత్ బౌలర్లు నియంత్రించలేకపోయారు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 5 ఓవర్లలో 36 పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్ (17), స్టబ్స్ (14 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత మిల్లర్ ఔట్ అయినా ఫెలుక్వాయో, స్టబ్స్ మిగతా పనిని పూర్తి చేశారు. దీంతో 39 బంతుల్లోనే 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రింకూ సింగ్ వృథాగా పోయింది. 
 
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ భారీ స్కోరు చేయకుండా నియంత్రించడంలో కీలక పాత్ర పోషించిన షంసి (1/18)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 1-0 తేడాతో వెనుకబడింది. మొదటి మ్యాచ్ వర్షం కారణం రద్దయ్యింది. ఇక చివరి టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.
 
కాగా, ఈ మ్యాచ్‍లో భారత బ్యాటర్లలో రింకూ సింగ్ (68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (56)లు రాణించారు. సఫారీ బౌలర్లలో కోయెట్టీ 3 కీలకమైన వికెట్లు, మార్కో యెన్సెన్, విలియమ్స్, షంసీ, మార్క్‌రమ్ తలో వికెట్ తీశారు. అలాగే సాతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెండ్రిక్స్ (49), మార్క్‌రమ్ (30) చెలరేగి ఆడారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి 31 పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ కుమార్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ మాత్రమే తీశారు.