ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (20:26 IST)

సఫారీల వెన్ను విరిచిన శార్దూల్ ఠాకూర్ - 229 రన్స్‌కు ఆలౌట్

జోహాన్నెస్‌బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా రాణించి సఫారీల వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తం పది వికెట్లలో శార్దూల్ ఏకంగా ఏడు వికెట్లు తీయగా, షమీకి రెండు, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు 79.4 ఓవర్లలో 2.87 రన్‌రేట్‌తో 229 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ ఎల్గర్ 28, మారక్రామ్ 7, పీటర్సన్ 62, బవుమా 51, వెర్రీయన్నే 21, జాన్సన్ 21, మహరాజ్ 21 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 16 రన్స్ వచ్చాయి. దీంతో సౌతాఫ్రికా జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరగుల ఆధిక్యం లభించింది. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (8) వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 31. ప్రస్తుతం క్రీజ్‌లో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పుజరాలు ఉన్నారు. ఈ పిచ్ పేసర్లకు బాగా అనుకూలిస్తుండటంతో మ్యాచ్ ఫలితం వచ్చేలా కనిపిస్తుంది. కాగా, సెంచూరియన్ పార్కులో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.