శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (07:56 IST)

చారిత్రాత్మక విజయం కోసం ఒక్క అడుగుదూరం.. నేటి నుంచి రెండో టెస్ట్

సౌతాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక విజయం కోసం భారత క్రికెట్ జట్టు మరో టెస్ట్ విజయానికి దూరంలో ఉన్నది. ఇప్పటికే ఆతిథ్య సౌతాఫ్రికాతో సెంచూరియన్ పార్కు మైదానంలో జరిగిన తొలి టెస్టులో విజయభేరీ మోగించిన టీమిండియా.. సోమవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని తన సొంతం చేసుకుంటే, సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ సేన సరికొత్త రికార్డు సృష్టించి, సరికొత్త చరిత్ర సృష్టించినట్టే. అంటే సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్‌ను గెలిచిన ఘనతను దక్కించుకుంటుంది. అందుకే సర్వశక్తులు ఒడ్డేందుకు కోహ్లీ సేన తీవ్రంగా శ్రమిస్తుంది. 
 
ఈ మ్యాచ్ జోహాన్నెస్ బర్గ్‌లోని వాండరర్స మైదానంలో ప్రారంభంకానుంది. సఫారీ పిచ్‌లు ప్రధానంగా పేస్‌కు సహకరిస్తాయన్న విషయం తెల్సిందే. సహజంగా ఆతిథ్య జట్టు ఆధిక్యం ఉంటుంది. కానీ, తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన సెంచూరియన్ పార్కులో భిన్నపరిస్థితి కనిపించింది. సౌతాఫ్రికా పేసర్ల కంటే భారత పేసర్లే అద్భుతంగా రాణించారు. పిచ్ పరిస్థితులను బాగా సద్వినియోగం చేసుకున్న భారత పేసర్లు సఫారీల వెన్ను విరిచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.