శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2015 (22:29 IST)

చెన్నై వన్డేలో విజయం సాధించిన టీమిండియా: 2-2 తేడాతో సిరీస్ సమం

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన నాలుగో వన్డేలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మహాత్మ గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా వన్డే సిరీస్‌ను భారత్ సమం చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గురువారం జరిగిన నాలుగోవన్డేలో భారత జట్టు 35 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (138) సెంచరీతో రాణించగా అతనికి రైనా (53), రహానే (45) చక్కని సహకారమందించారు. 
 
అనంతరం 300 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు డికాక్ (43), డివిలియర్స్ (112) సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే సాధించగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ రెండు, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత్ గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా వన్డే సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసింది. కాగా వన్డే సిరీస్‌లో భాగంగా ముంబైలో జరుగనున్న ఐదో వన్డే రసవత్తరంగా మారనుంది.
 
భారత్ చేతిలో ఓటమి సందర్భంగా దక్షిణాఫ్రికా వన్డే టీమ్ కెప్టెన్ డివిలియర్స్ మాట్లాడుతూ.. ముంబైలో జరిగే ఐదో వన్డేలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అంచనాల మేరకు తమ జట్టు రాణించలేదని.. అందుకే ఓటమి పాలయ్యామని డివిలియర్స్ తెలిపాడు. సిరీస్‌ను గెలుచుకునేందుకు తమకు మరో అవకాశం మిగిలి ఉందని, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.