మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (12:59 IST)

ఆసియా కప్ టోర్నీ : ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ మహిళా జట్టు

women india cricket team
మహిళల ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా, భారత మహిళా జట్టు తన జోరును కొనసాగిస్తోంది. లీగ్‌ దశలో పసికూన థాయ్‌లాండ్‌ను 37 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు.. గురువారం అదే జట్టుపై జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది.
 
బ్యాటింగ్‌, బౌలింగ్‌‌తో పాటు అన్ని విభాగాల్లో రాణించిన భారత జట్టు థాయ్‌ను 74 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో భారత్‌  ఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ(42) అద్భుత ప్రదర్శన చేయగా.. బౌలింగ్‌లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని గట్టి దెబ్బకొట్టింది.
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన థాయ్‌లాండ్‌ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ప్రత్యర్థికి 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదన ఆరంభించిన థాయ్‌ జట్టును భారత బౌలర్‌ దీప్తి శర్మ ఆరంభంలోనే బోల్తా కొట్టించింది. 
 
మూడో ఓవర్లో దీప్తి వేసిన ఐదో బంతిని ఓపెనర్‌ కొంచారోయింకై షాట్‌కు ప్రయత్నించగా.. షఫాలీ వర్మ అద్భుతమైన క్యాచ్‌ పట్టింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లను కోల్పోయిన థాయ్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
ఆ తర్వాత నరూమోల్‌ చైవై, నట్టాయ బూచతమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి థాయ్‌ వికెట్ల పతనం ఆగలేదు. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 74 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌ అలవోకగా ఫైనల్‌కు చేరుకుంది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రాజేశ్వరీ గైక్వాడ్‌ 2, రేణుకా సింగ్‌, స్నేహ్‌ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్ సాధించారు.