1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (15:56 IST)

విరాట్ కోహ్లీ ఫిఫ్టీ-రోహిత్ శర్మ రికార్డు సమం

సొంతగడ్డపై టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా గెలుచుకుంది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), రిషభ్ పంత్ (28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్ తలో వికెట్ తీశారు.
 
వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. 41 బంతులాడిన కోహ్లీ 52 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో కోహ్లీకి ఇది 30వ అర్ధసెంచరీ. 
 
ఈ అర్ధసెంచరీ సాయంతో కోహ్లీ... రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ పేరిట 30 అర్ధసెంచరీల రికార్డు ఉంది. తాజా ప్రదర్శనతో కోహ్లీ కూడా రోహిత్ సరసన నిలిచాడు.
 
అయితే, టీ20 ఫార్మాట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లీనే. కోహ్లీ ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో 10,221 పరుగులు సాధించాడు. 
 
ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (14,529), షోయబ్ మాలిక్ (11,611), కీరన్ పొలార్డ్ (11,419), ఆరోన్ ఫించ్ (10,434), డేవిడ్ వార్నర్ (10,308) ఉన్నారు.