శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (06:09 IST)

సిరీస్ టీమిండియాదే.. ఇండోర్ వన్డేలో ఆసీస్ చిత్తు...

సొంతగడ్డపై టీమిండియా సింహంలా గర్జించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే కైవసం చేసుకుంది. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో వికెట్ల 5 తేడాతో ఘన విజయం సాధించింద

సొంతగడ్డపై టీమిండియా సింహంలా గర్జించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే కైవసం చేసుకుంది. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో వికెట్ల 5 తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 
 
ఓపెనర్లు రహానే (70), రోహిత్‌ శర్మ(70) అద్భుత ఆరంభాన్ని ఇవ్వగా, హార్దిక్‌ పాండ్యా(78) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు. నాలుగో వన్డే ఈ నెల 28న బెంగళూరు వేదికగా జరగనుంది.
 
అంతకుముందు తొలుత టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్‌లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. జట్టు స్కోరు 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు వార్నర్ (42) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి అరోన్ ఫించ్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించారు. ఈ క్రమంలో ఫించ్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 124 పరుగులు చేయగా కెప్టెన్ స్మిత్ 71 బంతుల్లో 5 ఫోర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యారు. 
 
ఈ క్రమంలో 224 పరుగుల వద్ద ఫించ్ ఔటైన తర్వాత భారత బౌలర్లు పట్టుబిగించారు. క్రమంగా వికెట్లు తీస్తూ ఆసీస్ భారీ స్కోరు 300 పరుగులు దాటకుండా అడ్డుకున్నారు. స్మిత్ అవుటయ్యాక ఆసీస్ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. మ్యాక్స్‌వెల్ (5), ట్రావిస్ హెడ్ (4), హ్యాండ్స్‌కోంబ్ (3), స్టోయిన్స్ 27 (నాటౌట్), అగర్ 9 (నాటౌట్) పరుగులు మాత్రమే చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, చాహల్, పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది.
 
అనంతరం 294 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన... 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో నెగ్గింది. రహానే 70, రోహిత్ శర్మ 71, కోహ్లీ 28, పాండ్యా 78, జాదవ్ 2, పాండే 36, ధోనీ 3 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు కమిన్స్ 2, నీల్ 1, రిచర్డ్‌సన్ 1, అగర్ 1 వికెట్ తీశారు.