శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (13:10 IST)

ఐపీఎల్ వాయిదా : అభిమానుల వీడ్కోలు మధ్య స్వస్థలానికి ధోనీ

స్వదేశంలో ఈ నెల 29వ తేదీన నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ జరగాల్సివుంది. అయితే, కరోనా వైరస్ భయం కారణంగా ఈ టోర్నీని ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదావేశారు. దీంతో ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో నిమగ్నమైవున్న క్రికెటర్లు తమతమ స్వస్థాలకు వెళ్లిపోతున్నారు. 
 
నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ కోసం రెండు వారాల ముందునుంచే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఈ ప్రాక్టీస్‌లో జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా పాల్గొన్నారు. ఐపీఎల్ టోర్నీ వాయిదాపడటంతో ధోనీ తన స్వరాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. 
 
వాస్తవానికి ఐపీఎల్ పోటీలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సివుండగా, వాటిని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అప్పుడన్నా ప్రారంభమవుతాయా? అన్న విషయంపైనా సందేహాలు నెలకొనివున్నాయి.
 
ఈ నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం, ప్రాక్టీస్ సెషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ధోనీ సహా, జట్టులో కీలక ఆటగాళ్లయిన సురేశ్ రైనా, అంబటి రాయుడు వంటి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి చిన్న వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
 
ఇందులోభాగంగా చెపాక్ స్టేడియంలో కాసేపు గడిపిన ధోనీ, ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు సెల్ఫీలు ఇస్తూ సరదాగా కాలం గడిపాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్‌పై స్పష్టత వచ్చిన తర్వాతనే ధోనీ తిరిగి చెన్నైకి వస్తారని ప్రకటించింది.