గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (17:48 IST)

కరోనా వైరస్ ఎఫెక్టు : ఐపీఎల్ టోర్నీ రద్దుకు కర్నాటక పట్టు

ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళిస్తోంది. ఇప్పటికే 113 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ధాటికి ఇప్పటివరకు 4010 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వేలాది మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులో పెరిగిపోతున్నాయి. సోమవారానికి 10కు పైగా దాటిన ఈ కేసులు.. మంగళవారానికి 50కు పెరిగాయి. బెంగుళూరులో నాలుగు, కేరళలో ఆరు కేసులు కొత్తగా నమోదయ్యాయి. 
 
ఈ క్రమంలో త్వరలో స్వదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ జరగాల్సివుంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని వాయిదా పడుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ యధావిధిగానే జరుగుతుందని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పునరుద్ఘాటిస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఐపీఎల్ టోర్నీని నిర్వహించరాదంటూ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ హోమ్‌గ్రౌండ్‌ అయిన బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు సమాచారం. లీగ్‌ను వాయిదా వేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు వార్తలు వెలుపడుతున్నాయి. 
 
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా సోకిందని ఇటీవలే గుర్తించారు. అమెరికా నుంచి వచ్చిన ఆ వ్యక్తి దాదాపు 2,666 మందిని తాకినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో, బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌‌ సంస్థలు ఉన్న ప్రదేశాల్లోని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి రాష్ట్ర సర్కారు స్పష్టం చేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వార్తలతో బెంగళూరులోనేకాకుండా దేశవ్యాప్తంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరిదీనిపై అటు కేంద్రం, ఇటు బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సివుంది.
 
ఐపీఎల్‌ జరుగుతుందన్న గంగూలీ 
ప్రపంచంతో పాటు.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా.. ఐపీఎల్‌ను మాత్రం వాయిదా వేసే ప్రసక్తే లేదని బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ ఈనెల 29వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై జట్ల మధ్య జరుగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ మ్యాచ్‌ నిర్వహణపై మహారాష్ట్ర సర్కారు వెనకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఇదే అంశంపై మహారాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె స్పందిస్తూ, ప్రజలు పెద్దఎత్తున గుమిగూడితే కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందనీ.. అందుకే ఐపీఎల్‌ను వాయిదా వేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. 'ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌ వాయిదా వేయం. మ్యాచ్‌లు జరిగే వేళ కరోనా కట్టడికి అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని స్పష్టం చేశారు.