గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (11:51 IST)

క్రికెట్ బెట్టింగ్ యాప్.. క్షౌరశాల నిర్వాహకుడికి కోటి రూపాయలు

క్రికెట్ బెట్టింగ్ ఆ క్షౌరశాల నిర్వాహకుడికి అదృష్టం తలుపు తట్టింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన 'డ్రీమ్-11'లో అశోక్ బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడిని వరించింది. కోటి రూపాయలు మోసుకొచ్చింది. అంత సొమ్ము గెలుచుకునే సరికి అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
 
వివరాల్లోకి వెళితే..నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచీ ఆసక్తి ఉన్న అతడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 'డ్రీమ్-11'లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు.
 
ఈ క్రమంలో ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. విషయం తెలిసి అశోక్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, కోటి రూపాయలు వచ్చినంత మాత్రాన వృత్తిని వదులుకోబోనని చెప్పుకొచ్చాడు. వచ్చిన సొమ్ముతో తొలుత అప్పులు తీర్చి, ఆపై ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.