శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (12:40 IST)

#MithaliPlaysCricketInSaree - చీరకట్టు, నుదుట బొట్టుతో క్రికెట్ (Video)

#MithaliPlaysCricketInSaree
#MithaliPlaysCricketInSaree అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అలా క్రికెట్ రంగంలో రాణిస్తున్న భారత దేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లక్ష్యాలను తెలుపుతూ ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియోలో మిథాలీ చీరకట్టులో క్రికెట్ ఆడుతోంది. 
 
ఇంకా ఆమె సాధించిన లక్ష్యాలను ఆ వీడియోలో పొందుపరిచారు. చీరకట్టు, నుదుట బొట్టుతో భారతీయ మహిళా సంస్కృతికి మిథాలీ రాజ్ ఈ వీడియోలో అద్దం పట్టేలా వుంది. చేత బ్యాట్ పట్టుకుని బంతిని సంధిస్తోంది. ఈ క్రమంలో వన్డేల్లో 6వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెట్ క్రీడాకారిణిగా ఆమెపై రికార్డుందన్న విషయాన్ని వీడియోలో పేర్కొన్నారు. 
 
అలాగే 2003లో అర్జున అవార్డు గ్రహీత, 2015లో అత్యున్నత పద్మశ్రీ అవార్డును పొందిన విషయాన్ని తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ.. ఆమె మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసేలా ఈ వీడియో వుంది. 
 
ఇకపోతే.. 1982, డిసెంబర్ 3న జన్మించిన మిథాలి రాజ్ భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ప్రవేశించి ఐర్లాండ్‌పై 114 పరుగులు సాధించి నాటౌట్‌గా నిల్చింది. 2001-02లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్‌పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‍లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 
 
2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆమె భారత జట్టుకు నాయకత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసేది.  2003లో ఆమెకు అర్జున అవార్డు పురస్కారం లభించింది. ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తోంది.
 
జోధ్‌పూర్‌లోని ఓ తమిళ కుటుంబంలో పుట్టిన మిథాలీ రాజ్ అన్నీ ఫార్మాట్లలో ఆరువేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా పేరు సంపాదించింది. అలాగే వంద పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల స్థానంలో మిథాలీ మూడో స్థానంలో వుంది. 
 
ప్రొఫైల్ వివరాలు 
పూర్తి పేరు.. మిథాలీ దురై రాజ్ 
వయస్సు - 37 సంవత్సరాలు 
జట్లు - ఎయిర్ ఇండియా వుమెన్, ఆసియా వుమెన్ లెవన్, టీమిండియా (ఇండియా బ్లూ వుమెన్), వెలాసిటీ 
ప్లేయింగ్ రోల్ - టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 
బ్యాటింగ్ స్టైల్ - కుడిచేతి వాటం
టెస్టులు - 10 మ్యాచ్‌లు, 663 పరుగులు, ఒక సెంచరీ, 4 అర్థ సెంచరీలు, 
వన్డేలు - 209 మ్యాచ్‌లు, 6888 పరుగులు, 7 సెంచరీలు, 53 అర్థ సెంచరీలు, 
టీ-20 - 89 మ్యాచ్‌లు, 2364 పరుగులు, 17 అర్థ సెంచరీలు.