సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (08:36 IST)

బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ స్పిన్నర్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టరుగా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేస్ బౌలర్ హర్వీందర్ సింగ్‌ను ఎంపిక చేశారు. 
 
కాగా, సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక విషయమై క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి సీఏసీ సభ్యులు మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్, సులక్షణా నాయక్‌లు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూకు సునీల్ జోషి, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఎల్.ఎస్.శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, హర్వీందర్ సింగ్ హాజరు కాగా, వీరిలో సునీల్ జోషిని చీఫ్ సెలెక్టరుగా ఎంపిక చేశారు. 
 
సీఏసీ సిఫారసుల మేరకు సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ పేర్లను బీసీసీఐ ప్రకటించింది. కాగా, త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం సునీల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెల్సిందే.