బంగ్లా కెప్టెన్ షకీబ్ తీరు అవమానకరం.. లంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, సోమవారం ఢిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ఔటైన తీరు తీవ్ర వివాదంతో పాటు చర్చకు దారితీసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ విన్నపం మేరకు ఫీల్డ్ అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో తీవ్ర అసహనంతో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఫేస్ చేయకుండా డౌకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ అనతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తీరుపై మాథ్యూస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు ఇంకా సమయం ఉన్నా ఔట్‌గా ప్రకటించారని, ఆ వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్టు తెలిపారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. దీనిపై కూడా మాథ్యూస్ స్పందించారు.
"నేనేమి తప్పు చేయలేదు. బ్యాటింగ్ కోసం రెండు నిమిషాల్లోనే సిద్ధమయ్యా. అయితే, హెల్మెట్ సరిగా లేదని గుర్తించారు. ఇదేవిషయం ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పా. మరి వారి కామన్‌సెన్స్ ఏమైందో నాకు తెలియదు. షకీబ్, బంగ్లా జట్టు నుంచి అవమానకరరీతిలో ప్రతిస్పందన వచ్చింది. వారు ఇదే విధంగా క్రికెట్ ఆడాలనుకుంటే ఆ స్థాయికి దిగిపోండి. ఇలా ప్రవర్తించడం మాత్రం చాలా తప్పు. నేను రెండు నిమిషాల్లోపు సిద్ధంగా ఉండకపోతే ఔటని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, అప్పటికీ ఐదు సెకన్ల సమయం మిగిలేవుంది. నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇదంతా వారి కామన్‌సెన్స్‌కే వదిలివేస్తున్నా. ఇక్కడ నేను మస్కడింగ్, ఫీల్డర్‌ను అడ్డుకోవడం వంటి వాటి గురించి మాట్లాడటం లేదు.
ఇకపోతే, మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం చేసుకోకపోవడం పెద్ద విషయమేమీ కాదు. మీరు ఇతరుల నుంచి గౌరవం పొందాలనుకుంటే మీరు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి. మేమంతా ఈ జెంటిల్మెన్ గేమ్‌కు రాయబారులం కాదు. ఇతరులకు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించినపుడు మీరేం అడగ్గలరు. ఇప్పటివరకు నాకు బంగ్లాదేశ్ గౌరవం పట్ల గౌరవుం ఉండేది. ఇరు జట్లూ విజయం కోసమే పోరాటం చేస్తాయం. మైదానంలో నిబంధనలు పాటించడం మంచిదే. కానీ నేను రెండు నిమిషాల్లోనే సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి వీడియో ఆధారులూ మా వద్ద ఉన్నాయి. తప్పకుండా వీటిని తర్వాత బయటపెడతాం.
వికెట్ పడినప్పటి నుంచి నేను క్రీజ్‌లోకి వచ్చే వరకు తీసుకున్న సమయం ఎంతనే దానిపై ఆధారాలతో మాట్లాడుతున్నా. నా 15 యేళ్ల కెరీర్‌లో ఇలా దిగజారిపోయిన జట్టును ఎన్నడూ చూడలేదు. అంపైర్లు కూడా ఇలాంటి విషయాల్లో మెరుగైన నిర్ణయం తీసుకోవాలి. నేను క్రీజ్‌లో ఉండుంటే నా జట్టు గెలిచివుండేదని నేను చెప్పడం లేదు. కానీ, మనకు కాస్తయినా ఇంజ్ఞిత జ్ఞానం ఉండాలి కదా. నేను కావాలని హెల్మెట్ స్ట్రిప్‌ను లాగేయలేదు. అదే ఊడిపోయింది. అయితే, బంగ్లాదేశ్ జట్టు వ్యవహరించిన తీరు మాత్రం నన్ను తీవ్రమైన షాక్‌కు గురిచేసింది. మరే జట్టు కూడా ఇలా ఆలోచన చేయదు" అని మ్యాథ్యూస్ వ్యాఖ్యానించారు.