బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 28 జులై 2017 (06:02 IST)

మిథాలీ టీమ్‌కు జననీరాజనం.. దేశానికి మేలు చేసే ఆట ఆడారని ప్రధాని ప్రశంసలు

మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్ వంటి కీలకమైన ఆటలో అనుభవ లేమితో చేతులారా విజయాన్ని దూరం చేసుకున్న జట్టు స్వదేశంలో అపూర్వ స్వాగతాన్ని అందుకుంటుందనీ, సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే వారిని సాదరంగా ఆహ్వానించి వారి ప్రతిభను కొనియాడతారని ఎన్నడైనా ఊహించామా.. ముంబై విమా

మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్ వంటి కీలకమైన ఆటలో అనుభవ లేమితో చేతులారా విజయాన్ని దూరం చేసుకున్న జట్టు స్వదేశంలో అపూర్వ స్వాగతాన్ని అందుకుంటుందనీ, సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే వారిని సాదరంగా ఆహ్వానించి వారి ప్రతిభను కొనియాడతారని ఎన్నడైనా ఊహించామా.. ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి టీమిండియా మహిళా జట్టుకు భారత్ నీరాజనాలర్పిస్తూనే ఉంది. ఓడినందుకు కాదు ఓడి కూడా గెలిచినంత పేరు సాధించినందుకు.. ప్రపంచ కప్ ఫైనల్ పొడవునా తాము సాధించిన అద్భుత విజయాల ముందు ఆ ఫైనల్‌లో ఓటమిని సాధారణ అభిమానుల నుంచి ప్రధాని  వరకు తేలిగ్గానే తీసుకున్నారు.
 
బుధవారం ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టిన మహిళా జట్టుకు వారు ఊహించని దృశ్యం ఎదురైంది. ప్రపంచ కప్ ఆడటానికి వెళ్లేముందు ఇదే ముంబైలో ఇదే టీమ్‌ను పలకరించడానికి వచ్చిన మీడియా మిత్రులు పట్టుమని పదిమంది కూడా లేని స్ఖితిని చూసిన మహిళా జట్టు సభ్యులు.. ఫైనల్ ముగిసిన తర్వాత అదే ముంబైలో తమకు స్వాగతం చెప్పడానికి పదిరెట్లమంది పైగా జర్నలిస్టులను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక అభిమానులయితే వెల్లువలా వచ్చారు. వారు బస చేసిన స్టార్ హోటల్ స్టార్ హోటల్‌లా కాకుండా వారిని చుట్టుముట్టిన జనసంద్రాన్ని తలపించింది. సెల్ఫీలుతీసుకునేవారు, మిథాలీ జట్టును ఆరాధనతో చూసేవారు, వారు ఎక్కడ ఉంటే అక్కడ గుమికూడేవారు. జీవిత కాలం మర్చిపోలేని అనుభూతి అది
 
మిధాలీ మాటల్లో చెప్పాలంటే.. ఈ సన్నివేశం అపూర్వం. 2005లోనూ ఫైనల్‌ని ఆస్ట్రేలియా జట్టుకు కోల్పోయి ఇండియాకు తిరిగి వస్తే బీసీసీఐ నుంచి ఒక్కరంటే ఒక్కరు మహిళా జట్టును రిసీవ్ చేసుకోవడానికి రాలేదని మిథాలీ బాధను వ్యక్తం చేసింది. ఇన్నాళ్లకయినా మహిళల జట్టును ఇలా గుర్తించినందుకు, వివక్ష లేని అభినందనలు తెలిపినందుకు మిథాలి సంతోషం వ్యక్తం చేసింది. ఈ ప్రశంసలు, ప్రోత్సాహం, గుర్తింపు రేపు మహిళా జట్టులో స్థిరపడేువారికి ఊపిరి పోస్తుందని దేశంలో మహిళల క్రికెట్‌ అభివృద్ధికి తోడ్పడుతుందని మిథాలీ  చెప్పింది.
 
మహిళల ప్రపంచకప్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో భారత జట్టు ప్రదర్శన కనబర్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. గురువారం మిథాలీ రాజ్‌ బృందానికి ప్రధాని ఆతిథ్యం ఇచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళలు ఇటీవల అత్యుత్తమ ఫలి తాలు సాధిస్తున్నారు. ఇప్పుడు క్రికెట్‌ జట్టు కూడా ప్రపంచకప్‌ ఫైనల్‌ వరకు చేరి అబ్బుర పరిచింది. ఆయా విభాగాల్లో మహిళలు సాధిస్తున్న ఈ పురోగతి దేశానికి మేలు చేస్తుంది’ అని మోదీ తెలిపారు. ఈ భేటీలో ఆయనకు తమ సంతకాలతో కూడిన బ్యాట్‌ను క్రికెటర్లు అందించారు. 
 
అంతకుముందు భారత జట్టు గురువారమంతా తీరికలేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడిపింది. క్రీడా, రైల్వే శాఖలతో పాటు బీసీసీఐ ఆధ్వర్యంలో జట్టుకు ఘన సన్మానం జరిగింది. బీసీసీఐ జట్టు సభ్యులకు రూ.50 లక్షల చొప్పున... రైల్వే శాఖ ‘తమ’ క్రికెటర్లకు రూ.13 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. రైల్వేస్‌ తరఫున ఆడే భారత జట్టులోని 10 మంది క్రికెటర్లకు నేరుగా ప్రమోషన్‌ కూడా ఇచ్చింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్‌ ‘బి’ గెజిటెడ్‌ ర్యాంక్‌ అయిన చీఫ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ (చీఫ్‌ ఓఎస్‌)గా ప్రమోషన్‌ దక్కింది.