శుక్రవారం, 21 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (09:06 IST)

బోరున విలపించిన సన్‌రైజర్స్ జట్టు బ్యాటర్ రాహుల్ త్రిపాఠి

rahul tripati
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సన్రైజర్స్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి కంటితడి పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
'మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది డే' క్యాప్షన్‌తో క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఏంటంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడిన తాను అనూహ్య రీతిలో రనౌట్ అవడాన్ని రాహుల్ త్రిపాఠి జీర్ణించుకోలేకపోయాడు. భారమైన హృదయంతో మైదానాన్ని వీడిన త్రిపాఠి పెవీలియన్‌కు వెళ్లేదారిలో మెట్లపై కూర్చొని బోరున విలపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీంతో 'మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది డే' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
 
కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమైనప్పటికీ రాహుల్ త్రిపాఠి రాణించాడు. 35 బంతుల్లో 55 పరుగులు బాదాడు. దీంతో సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే ఓ పరుగు తీసే విషయంలో బ్యాటింగ్ చేసిన అబ్దుల్ సమద్, అవతలి ఎండ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి మధ్య సమన్వయం జరగలేదు. దీంతో అనూహ్య రీతిలో రాహుల్ త్రిపాఠి రనౌట్ కావాల్సి వచ్చింది. 
 
ఈ పరిణామంతో సన్ రైజర్స్ ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు. కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్ 3 కీలకమైన వికెట్లు తీసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టిన కోల్‌కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.