శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (23:23 IST)

భారత్ మరో భారీ క్రికెట్ స్టేడియం.. జైపూర్​లో నిర్మాణం

Rajasthan
భారత్ మరో భారీ క్రికెట్ స్టేడియానికి వేదిక కానుంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాను నిర్మించగా.. తాజాగా మరో పెద్ద మైదానాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. 75 వేల మంది సీటింగ్​ సామర్థ్యంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్​ స్టేడియాన్ని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) నిర్మించనుంది.
 
జైపూర్​లో ఈ స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆర్‌సీఏకు రూ.100 కోట్ల సాయం అందించనుంది. అహ్మదాబాద్​లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్​ తర్వాత అతిపెద్ద స్టేడియంగా ఇది నిలవనుంది. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని ఆర్‌సీఏ లీజుకు తీసుకుంది. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 
 
జైపూర్​ శివారులో చోప్​ గ్రామంలో ఈ మైదానాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్​సీఏ.. కార్పొరేట్​ బాక్స్​ల విక్రయం ద్వారానూ నిధులను సమీకరించనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ప్రపంచస్థాయి వసతులు, అధునాతన సౌకర్యాలతో కొత్త స్టేడియం రూపుదిద్దుకోనుంది. 
 
ఇండోర్​ గేమ్స్​, శిక్షణ అకాడమీలు, క్లబ్​ హౌస్, భారీ పార్కింగ్ స్థలం, రెండు ప్రాక్టీస్​ గ్రౌండ్లు నిర్మించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు‌లో నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో మొతేరా మైదానాన్ని నిర్మించారు. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ లక్షా 10 వేలు. 1,00,024 సామర్థ్యంతో ఇప్పటిదాకా అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును బద్దలు కొట్టిన మొతేరా మైదానం కోసం ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు.