శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (19:53 IST)

నోరు జారిన రవిశాస్త్రి - తప్పులు సరిదిద్దుకోవడం వల్లే విజయం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రవిశాస్త్రి నోరు జారారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య కంగారులను చిత్తు చేసి తొలి టెస్ట్ మ్యాచ్‌లో చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ నోరుజారారు. దీనిపై నెటిజన్లు పలురకాలైన కామెంట్స్ చేశారు. కానీ, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం రవిశాస్త్రికి అండగా నిలిచాడు. అయితే, అడిలైడ్‌లో టీమిండియా ప్రదర్శనపై రవిశాస్త్రి స్పందిస్తూ, తమ బ్యాట్స్‌మెన్లు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని, రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేశారన్నారు. 
 
'తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ చెత్త షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకున్నారు. ఆ తప్పుల నుంచి నేర్చుకుని కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడారు. ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి టెస్టులో గెలుపు ముంగిట 31 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయాం. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులోనూ 72 పరుగులతో ఓటమిపాలయ్యాం. ఈసారి ఆలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా విజయంతో సిరీస్‌ను ఆరంభించడం సంతోషంగా ఉంది' అని మ్యాచ్‌ అనంతరం శాస్త్రి అన్నాడు.
 
కాగా, అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 31 పరుగులతో చరిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 250 పరుగులను డిఫెండ్‌ చేసే క్రమంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని శాస్త్రి కొనియాడాడు. ఇలా క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తే.. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా విజయం వరిస్తుందన్నారు. పెర్త్‌ వేదికగా జరుగనున్న రెండో టెస్టు డిసెంబరు 14 నుంచి ప్రారంభం కానుంది. మరో నాలుగు రోజులే ఉండటంతో ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.