రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు చాలా అరుదు... అతన్ని పట్టుకోవాల్సిందే : రవిచంద్రన్ అశ్విన్
భారత క్రికెటర్ రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారిని అస్సలు వదులుకోరాదని టీమిండియా వెటర్న్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్ పాత్రలపై అశ్విన్ స్పందించారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పాక ఆయన కోచ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని, కానీ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు సిద్ధంగా ఉండకపోవచ్చన్నారు. ముఖ్యంగా రోహిత్ రిటైర్ కాగానే అతడి సేవలను వినియోగించుకోవాలని ముంబై ఇండియన్స్‌కు సూచించారు.
రోహిత్ శర్మ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రశంసిస్తూ.. 'రేపు రోహిత్ ఆడనని నిర్ణయించుకుంటే, ముంబై ఇండియన్స్ అతడిని తక్షణమే తీసుకోవాలి. ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలిపించి, భారత్‌కు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సేవలను వదులుకోకూడదు. అలాంటి వ్యక్తులు సులభంగా దొరకరు.
ఒకవేళ హెడ్ కోచ్ పాత్ర శ్రమతో కూడుకున్నదని అతను భావిస్తే, ఒకటి రెండేళ్ల విరామం తర్వాత ఏదో ఒక పాత్రలో తిరిగి వస్తాడు. రాహుల్ ద్రవిడ్ కూడా విరామం తీసుకుని వచ్చాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీరు చూస్తే, రోహిత్ శర్మ లాంటి ఆలోచనాపరుడిని వారు వదులుకుంటారని నేను అనుకోవడం లేదు' అని అశ్విన్ వివరించాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, 'నా అభిప్రాయం ప్రకారం, విరాట్ వెంటనే కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉండడు. ఇద్దరూ కెరీర్‌లో చాలా కష్టపడ్డారు. విరాట్ తన సుదీర్ఘ, తీవ్రమైన కెరీర్ తర్వాత ఖచ్చితంగా విరామం తీసుకోవాలనుకుంటాడు' అని అశ్విన్ అంచనా వేశాడు. 39 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో అశ్విన్ వ్యాఖ్యలకు ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
