#కోచ్‌గా మారిన టెండూల్కర్.. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం..?
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది. 'బుష్ ఫైర్ క్రికెట్ బ్యాష్' పేరుతో నిర్వహిస్తున్న ఈ ఛారిటీ మ్యాచ్ కు నేను సైతం అంటూ ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెటర్లు ముందుకొచ్చారు. పాంటింగ్ ఎలెవెన్, షేన్ వార్న్ ఎలెవన్ మధ్య ఫిబ్రవరి 8న మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌తో సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగుతున్నారు. సచిన్ పాంటింగ్ ఎలెవన్ జట్టుతో చేరారు. కానీ క్రికెట్ ఆడడానికి కాదు. పాంటింగ్ ఎలెవెన్ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కోట్నీ వాల్ష్ .. షేన్ వార్న్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు.
ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికీ పాంటింగ్, బ్రెట్ లీ, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్, మైఖెల్ క్లార్క్, స్టీవ్ వా, మెల్ జోన్స్, షేన్ వార్న్, జస్టిన్ లాంగర్, ఆడమ్ గిల్ క్రిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 8న జరిగే మ్యాచ్ కోసం స్టేడియం సిద్ధం కానుంది. నిజానికి ఈ మ్యాచ్ ను ఓవల్ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. కానీ అదే రోజు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ ఉంది. మరి ఛారిటీ మ్యాచ్‌కు ఏ స్టేడియం ముస్తాబవుతుందో వేచి చూడాలి.