7000 పరుగుల మైలురాయిని చేరిన రోహిత్ శర్మ.. కానీ గాయం వీడలేదు..
అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 7000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. కేవలం 137 ఇన్నింగ్స్‌లో హిట్ మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. శుక్రవారం ఆసీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. 2019లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన హిట్ మ్యాన్ ''ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్''గా నిలవడం తెలిసిందే.
తాజాగా 7వేల పరుగుల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా రోహిత్ నిలవడం ద్వారా క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ఓపనర్ ఆమ్లా(147 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డుని రోహిత్ తన పేరిట తిరగరాసుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 7000 పరుగులు సాధించిన ఓపనర్ల జాబితాలో రోహిత్, ఆమ్లా తర్వాతటి స్థానాల్లో సచిన్ టెండుల్కర్(160 ఇన్నింగ్స్), దిల్షాన్(165) ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఓవైపు భారీ విజయంతో సంతోషంగా ఉన్న భారత అభిమానులకు ఆటగాళ్లను వరుసగా వెంటాడుతున్న గాయాలు కలవరపెడుతున్నాయి. తొలి వన్డేలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడి కంకషన్ తీసుకోగా.. తాజా మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, ధావన్ గాయాలకు గురయ్యారు. దీంతో బెంగళూరు వేదికగా జరిగే డిసైడర్ వన్డేలో ఈ ఓపెనింగ్ జోడీ బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.