గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (14:43 IST)

ఐసీసీ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌‌లు.. సచిన్ స్పందన ఏంటంటే?

టెస్టు మ్యాచ్‌లను జనరంజకం చేసేందుకు ఐసీసీ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను ప్రతిపాదిస్తోంది. దీనిపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందించాడు. టెస్టు మ్యాచ్ నిడివిని ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించడానికి బదులు ఐసీసీ నాణ్యమైన పిచ్‌ల ఏర్పాటుపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చాడు. పిచ్ బాగుంటే టెస్టు మ్యాచ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వివరించాడు.
 
కొత్త తరం అభిమానులను ఆకర్షించేందుకు ఆటకు సంబంధించి ప్రతి అంశాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నాడు.. సచిన్.  టెస్టుల్లో చివరిదైన ఐదో రోజున స్పిన్నర్లకు పిచ్ ఎంతో సహకరిస్తుందని, అలాంటి వెసులుబాటును స్పిన్నర్లకు దూరం చేయడం సబబు కాదని అన్నాడు. క్రికెట్ లో టెస్టు మ్యాచ్ ఫార్మాట్ స్వచ్ఛమైనదని, దీన్ని మార్చేందుకు ప్రయత్నించరాదని సూచన చేశాడు. 
 
ఐసీసీ మంచి నాణ్యమైన పిచ్‌లపై దృష్టి సారించాలనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చాడు. బంతితో స్పిన్‌, సీమ్‌, స్వింగ్, బౌన్స్‌ చేయవచ్చు. అది ఆటను బతికిస్తుంది. మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కుంబ్లే, హర్భజన్‌ వంటి స్పిన్నర్లు నాలుగు రోజుల టెస్టుకు మద్దతు ఇవ్వరని భావిస్తున్నానని సచిన్ తెలిపాడు.
 
కాగా ట్వంటీ-2 క్రికెట్‌కు క్రేజ్ పెరిగిపోతున్న నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో టెస్టు మ్యాచ్ లను జనరంజకం చేసేందుకు ఐసీసీ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లను ప్రతిపాదిస్తోంది. 
 
2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత సారథి విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్‌ పైన్‌, స్పిన్నర్‌ లైయన్‌ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.